దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుంది. ఈ సమయంలోనే కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించాలనే సంకల్పంతో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఓ నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి దాదాపు నెల రోజులు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 28 రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోతే వైరస్ వ్యాప్తి ఆగిపోయిందని భావించాలని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని, ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడంపైనే దృష్టిసారించనున్నట్టు వివరించారు.దేశవ్యాప్త లాక్‌డౌన్ రెండో దశలో కరోనావైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడం, మహమ్మారిపై పోరులో వివిధ పద్దతులలో మార్పులను ప్రోత్సహించడంపై దృష్టి పెడతామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం 732 జిల్లాల్లోని 380 జిల్లాలు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం శుభపరిణామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే ఢిల్లీ 1,561 రెండోస్థానంలో ఉంది. మొత్తం 30 మంది ఇప్పటి వరకూ చనిపోయారు. ఢిల్లీలో మొత్తం 16,282 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,561 మంది (9.58 శాతం)లో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. మొత్తం 13,748 మంది నివేదికల్లో నెగెటివ్‌గా వచ్చింది. మిగతావారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
రెండో దశ లాక్‌డౌన్‌లో కేంద్రం టార్గెట్ ఇదే.. వీటిపైనే ఫోకస్